
మన దేశంలో ప్రతి ఆడపిల్ల సావిత్రిబాయి పూలే చిత్రపటాన్ని తన గుండెల్లో భద్రపరుచుకోవాలని దళిత జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు తలగాన లక్ష్మీనారాయణ, సిపిఎం నాయకులు శోభన్ చెప్పారు. చందానగర్ అంబేద్కర్ కూడలి వద్ద సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల భవిష్యత్తును వర్తమానాన్ని లిఖించిన మహా మనిషి అని ఈ విషయం చాలా మంది ఆడపిల్లలకు తెలియకపోవడం విచారకరం. సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలు,దాడులు ఎదుర్కొని ఆడపిల్లల చదువు కోసం పరితపించారని తెలిపారు.ఉపాధ్యాయిని, రచయిత్రిగా ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని తెలిపారు.కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించాలని,ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని బలంగా బోధించారని తెలిపారు.ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారని గుర్తుచేశారు.కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సమాన హక్కుల కోసం పోరాటం చేశారని తెలిపారు. సామాజిక చైతన్యం స్త్రీ విద్య ద్వారా సాధ్యపడుతుందని బలంగా నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అందుకోసం సొంత ఖర్చుతో పాఠశాల ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు.వ్యవస్థ మార్పు కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని,పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొంగరి కృష్ణ, జర్నలిస్ట్ నాయకులు దల్లాపూర్ రవీందర్, అరుణ్, ఆనంద్ గౌడ్, శ్రీనివాస్, నరేష్, రాజేష్, జిహెచ్ఎంసి ఉద్యోగ సంఘం నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.