
శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం అధికారుల ధన దాహం 350 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల కష్టం నిరుపయోగంగా మారింది. అక్కడ అధికారులు తాము ఏమి చేసినా నడుస్తుందనే భావనతో ఉన్నారు. పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ల కాకుండా మరో సంస్థకు నిధులు విడుదల చేయడం ద్వారా భారీ అక్రమాలకు తెరతీశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన కనిపించకపోవడంతో ఆపరేటర్లు కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఎస్ ఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కళాశాలలో చదువుకొనే విద్యార్థులు పార్ట్ టైం పని చేస్తే పాకెట్ మనీ వస్తుందని ఆశపడి కాంట్రాక్టర్ దగ్గర తాత్కాలికంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా చేరారు.పని చేసిన కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకుండా పనిచేయని మరో సంస్థకు 28.5 లక్షలు బిల్లులు చెల్లించి తమకున్న ఘనతను చాటుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే నివేదిక ఆన్లైన్ లో అప్లోడ్ చేసేందుకు సాంకేతిక నైపుణ్యం ఉన్న సంస్థలకు పనులు అప్పగించారు. ఇందుకోసం నిర్వహించిన టెండర్లలో శేర్లింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో ఐదు మంది డేటా ఎంట్రీ సేవలందించే సంస్థలు పాల్గొనగా అందులో కోనా ఇ డేటా సొల్యూషన్స్ కు కుల గణన సర్వే నివేదిక వివరాలు ఆన్ లైన్ ఎంట్రి బాధ్యతలు అప్పగించారు. కోనా డేటా సొల్యూషన్స్ సంస్థ నుంచి ఎస్ ఎస్ ఎంటర్ప్రైజెస్ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని డేటా ఎంట్రీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 20 రోజులు పాటు 350 మంది డిటీపీ ఆపరేటర్లతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. వీరంతా వివిధ కళాశాలలో చదివే విద్యార్థులే ఉన్నారు.కుల గణన సర్వే పారాల ఆన్లైన్ నమోదు చేసేందుకు నిర్వహించిన టెండర్ లలో పాల్గొన్న వి మాక్స్ డేటా సొల్యూషన్స్ ఎక్కడ ఎప్పుడు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ఎంట్రీ బాధ్యతలలో పాల్గొనలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి వి మాక్స్ డేటా సొల్యూషన్స్ సంస్థ చేసినట్లు నివేదిక తయారు చేసి జిహెచ్ఎంసి కేంద్ర కార్యాలయం పంపించారు.దింతో వారి పేరు మీద 28.5 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్ ఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధుల డిప్యూటీ కమిషనర్ ను కలిసి తమకు మంజూరు చేయాల్సిన నిధులు పనితో ఏమాత్రం సంబంధం లేని మరో సంస్థకు నిధులు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మీతో మాకు సంబంధం లేదని మీరు ఎవరో మాకు తెలియదు అంటూ ఎదురు తిరగడంతో కంగుతున్నారు.ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కలిసిన ప్రయోజనం లేకపోవడంతో 350 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించారు.తమకు న్యాయం చేయాలని కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. ఈ విషయం ఉన్నతాధికారుల స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.ఇందుకు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.