రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్లై ఓవర్ వద్ద పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న విద్యార్థిని డబుల్ డెక్కర్ బస్సు ఢీకొని మృతి చెందింది. అన్న సుమంత్ తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా గచ్చిబౌలి పైవంతెనపై ఈ ఘటన జరిగింది. రాయదుర్గం ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపన్ పల్లి టీఎన్జీవోస్ కాలనీకి చెందిన బెనుధర్ ఛత్రియ కూతురు ప్రభాతి ( 19) గచ్చిబౌలి టెలికం నగర్ కాలనీ విజయ భారతి హై స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. రాయదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసి తన అన్న సుమంత్ (21) తో కలిసి బైకుపై ఇంటికి బయలుదేరారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పైకి రాగానే పక్క నుంచి వచ్చి హెచ్ఎండీ ఏ డబుల్ డెక్కర్ బస్సు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలైన ప్రభాతి అక్కడికక్కడే మృతి చెందింది. అన్నకు గాయాలయ్యాయి. సెక్రటేరియట్ నుంచి వేవ్ టాక్ వరకు ఉచితంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులను చేరవేసే డబుల్ డెక్కర్ బస్ ను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.ఒడిశా రాష్ట్రానికి చెందిన మృతురాలి కుటుంబ సభ్యులు ఓ అపార్టుమెంట్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు.