
మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన కళాకారుడు తెప్ప లోహిదాస్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం పశువులకు దాన పెట్టేందుకు కావిడి పట్టుకొని తోటకు బయలుదేరుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. మృతుడు తెప్ప లోహిదాస్ కు భార్య గోపమ్మ, కుమార్తె మధు, కుమారుడు ఉన్నారు. వివాహాది శుభకార్యాలలో మంగళ వాయిద్యంలో శృతి సన్నాయి వాయించడంలో దిట్ట. గంటలు తరబడి ఊపిరి ద్వారా శృతి ఊదడం అందుకు లయబద్ధంగా మేళం వాయిస్తారు. దానితోపాటు తుడుము, నరం కుండ వాయిద్యంలో నేర్పరి. ప్రభుత్వం కళాకారుడుగా గుర్తించి ప్రతి నెల గౌరవభృతి అందిస్తున్నారు. సౌమ్యుడుగా పేరున్న లోహిదాస్ వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ వీధిలో పెద్ద దిక్కున కోల్పోయామని తలగాన లక్ష్మీనారాయణ,సోదరులు తెప్ప భాగీరథి,డిల్లీరావు,మేనల్లుడు తలగాన కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సోమవారమే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు