
పరిశ్రమలు అభివృద్ధికి కార్మికుల భద్రత సంక్షేమం అత్యంత కీలకమని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వై మోహన్ బాబు స్పష్టం చేశారు.
క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, సిలికా&గ్రానైట్ పరిశ్రమలలో కార్మికులకు వృత్తి పరమైన భద్రత, ఆరోగ్యం,పరిశ్రమలలో విడుదలవుతున్న ధూళి నియంత్రణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహబూబ్‌నగర్ కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు లో ఉన్న FOSROC CHEMICALS INDIA (P) LIMITED పరిశ్రమలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమలకు చెందిన సేఫ్టీ ఆఫీసర్లు,సూపర్వైజర్లు,ప్రొడక్షన్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.సుమారు 110 మంది వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్మాగారాల శాఖ డైరెక్టర్ వై. మోహన్ బాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనలో పరిశ్రమల భద్రత ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా సిలికోసిస్ వంటి వృత్తి సంబంధిత వ్యాధుల నివారణకు పరిశ్రమలు ధూళి నియంత్రణ చర్యలు,ఆరోగ్య పర్యవేక్షణ, భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.పరిశ్రమలలో వినియోగించే వ్యక్తిగత రక్షణ పరికరాలు , భద్రతా పరికరాల ప్రదర్శన ప్రారంభించారు.

మహబూబ్‌నగర్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె. ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులకు భద్రతతో కూడిన పని వాతావరణం కల్పించడం ద్వారా ఉత్పాదక శక్తి పెరుగుతుందని తెలిపారు.క్వార్ట్జ్, సిలికా, ఫెల్డ్‌స్పార్ , గ్రానైట్ పరిశ్రమలు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ, ధూళి నియంత్రణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్మికుల భద్రత చర్యలు లోపభూయిష్టంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశ్రమల యజమానులు కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. కార్మికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పని ప్రదేశంలో రక్షణ,వృత్తిపరమైన అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం భద్రతా నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత రక్షణ పరికరాలను (PPE) తప్పనిసరిగా వినియోగించాలని భద్రతా ప్రతిజ్ఞ చేశారు.అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సభ్యులు, పరిశ్రమల నిపుణులు ధూళి నియంత్రణ పద్ధతులు, పి పి ఈ వినియోగం, వృత్తి ఆరోగ్య పరిరక్షణ, భద్రతా చట్టాలు, సిలికోసిస్ నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరిశ్రమలలో భద్రతా సంస్కృతి, కార్మికుల ఆరోగ్య పరిరక్షణ అధికారులు పలు కీలక సూచనలు చేశారు.సదస్సు విజయవంతం కావడంతో కర్మ గారాల శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.